Total Pageviews

261,680

Sunday, August 28, 2011

భగవద్గీత ప్రథమాధ్యాయము

భగవద్గీత ప్రథమాధ్యాయము
రణరంగమున సైనిక పరిశీలనము
ప్రతిపక్షసైన్యములు యుద్ధమునకు సిద్ధపడగా యుద్ధము నొనరించి ప్రాణత్యాగము చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరుసైన్యములందును గాంచెను. కరుణ మరియు విషాదములుచే జయింపబడినవాడై, బలమును కోల్పోయి, మనస్సు భ్రాంతిమయము కాగా అతడు యుద్ధనిశ్చయమును త్యజించెను.
1ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
2.దృష్ట్వా తు పాణ్ణవానీకం వూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
సంజయుడు పలికెను: ఓ రాజా! పాండవులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచి దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఇట్లు పలికెను.
3.పశ్యైతాం పాణ్ణుపుత్రాణామాచార్య మహతీం చమూహ్|
వూఢాం ద్రుపదపుతేణ తవ శిష్యేణ ధీమతా||
ఓ ఆచార్యా! సూక్ష్మబుద్దికలవాడునూ, మీ శిష్యుడునూ అగు ద్రుపదతనయునితో దక్షతగా నేర్పాటు చేయబడిన పాండవ సైన్యవ్యూహమును గాంచుము.
4.అత్రశూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధిః|
యుయుదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః||
ఈ సైన్యము నందు భీమర్జునౌలతో సమానముగా యుదము చేయగల శూరులైన ధనుర్దరులు పెక్కుమంది కలరు. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు అటువంటి మహాయోధులు.
5.ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్|
పురుజిత్ కున్తిబోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః||
మహారీరులైన ధృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యులును అందున్నారు.
6యధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||
పరాక్రమవంతుడైన యుయుధానుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, స్సుభద్రాతనయుడు, ద్రౌపదికుమారులను అందున్నారు. వీరందరును గొప్పయోధులు.
7అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్ధం తాన్ బ్రవీమి తే ||
కాని ఓ బ్రాహ్మణోత్తమా! మీకు తెలియుట కొరకు నా సైన్యమును నడుపుటకు సమర్ధులైన నాయకులగూర్చి నేను తెలియజేసెదను.
8భవాన్ భీష్మశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||
యుద్ధమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యము నందున్నారు.
9న్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః|
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః||
నాకొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్దపడియున్న వీరులు పలువురు వున్నారు. వారందరును వివిధ శస్త్రాస్త్రసంపన్నులును మరుయు యుద్ధవిశారదులునునై యున్నారు.
10.అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్|
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్||
పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడు మన సైన్యము అపరిమితముగా నున్నది. కాని భీమునిచే జాగురూకతతో రక్షింపబడుచున్న పాండవసైన్యము పరిమితముగా నున్నది.
11.అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః|
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి|| సేనావ్యూహ ద్వారమునందలి ఆయా ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునికు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి యున్నది. 12.తస్య సంజనయన్ హర్షం కురువృద్దః పితామహః|
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్||
అప్పుడు కురువృద్దుడును, పితామహుడును భీష్ముడు దుర్యోధనున కానందమును గూర్చుటకు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా శంఖమును పూరించెను.
13తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః|
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోభవత్||
తరువాత శంఖములు, పణవానకములు, భేరులు,కొమ్ములు ఆదివి ఏకకాలమున మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతిభీకరముగా నుండెను.
14తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ|
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః||
అంతట పాండవసైన్యము నందు శ్రీకృష్ణార్జునులు తెల్లని గుఱ్ఱములు పూన్చబడిన రథమునందు నందు ఆసీనులైనవారై వారి యొక్క దివ్య శంఖములను పూరించిరి.
15పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః|
పౌణ్డ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః||
శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమను శంఖమును పూరింపగా, అర్జనుడు దేవదత్తమును శంఖమును, ఘనకార్యములు చేయువాడును, భోజనప్రియుడును అగు భీముడు పౌండ్రమను మహాశంఖమును పూరించిరి.
16-18.అనస్త విజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః|
నకుః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ||
కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖణ్డీ చ మహారథః|
ధృష్టదుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే|
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ము పృథక్ పృథక్||
ఓ రాజా! కుంతీ పుత్రుడైన యుధిష్థిరుడు అనంతవిజయమను శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదితనయులు, గొప్ప బాహువులు కలగిన సుభద్రాతనయుడాది వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి
19.సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్య్దారయత్|
సభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్||
భూమ్యాకాశమ్లను ప్రతిధ్వనింపజేయుచు చెలరేగిన ఆ శంఖధ్వానములు ధృతరాష్ట్ర తనయుల హృదములను బ్రద్దలు చేసెను.
20.అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వజః|
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః|
హృషీకేశం తదా వాక్యమిదమాహ మాహ మహీపతే||
ఓ రాజా! అంతట కపిధ్వజము కూర్చబడిన రథము నందున్న అర్జనుడు ధనస్సును చేపట్టి, బాణములను విసురుటకు సిద్దపడి, వ్యూహముగా ఎదుట నిలచియున్న కౌరవులను గాంచి శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.
21-22.అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత|
యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్||
కైర్మయా సహ యోద్ధ్వ్యమస్మిన్ రణసముద్యమే||
అర్జనుడు పలికెను : ఓ అచ్యుతా! రెండు సేనల నడుమ నా రధమును నిలుపుము. తద్వారా యుద్ధము నొనరించుటకు చేరిన వారిని మరియు ఈ సంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును.
23.యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః|
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః||
దుష్టబుద్ది గల దృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
24.సంజయ ఉవాచ : ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత|
సేనయోరుభయోర్మధ్యే స్థాపయుత్వా రధోత్తమమ్||
సంజయుడు పలికెను : ఓ భరత వంశీయుడా! అర్జునునిచే అట్లు సంబోధింపబడినవాడై హృషీకేశుడైన శ్రీకృష్ణుడు ఉత్తమమైన తన రధమును ఇరుసేనల నడుమ నిలిపెను.
25.భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహిక్షితామ్|
ఉవాచ పార్ధ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి||
భీష్ముడు,ద్రోణుడు, ఇతర సర్వ భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు అర్జునునుద్దేశ్యించి " ఓ పార్ధా! ఇచ్చట కూడియున్నటు వంటి కురువంశీయులను గాంచుము" అని పలికెను.
26.తత్రపశ్యత్ స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్|
ఆచార్యాన్మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ సఖీన్ తథా|
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి||
అంతట అర్జునుడు ఇరుసేనల యందలి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
27.తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బన్ధూనవస్థితాన్|
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్||
సర్వవిధ బంధువులను, స్నేహితులను గాంచిన అర్జనుడు అంతట దయార్ద్రహృదయుడై ఇట్లు పలికెను.
28.అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ |
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ||
అర్జనుడు పలికెను : ఓ కృష్ణా! యుద్ధోత్సాహమున నాయెదుట నిలిచియున్న మిత్రులను, బంధువులను గాంచినంత నా శరీరావయవములన్నియును కంపించుచున్నవి. నోరు ఎండిపోచున్నది.
29.వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే|
గాణ్ణీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే||
దేహంమంతయు కంపించుచు రోమాంచమగుచున్నది. గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది, నాచర్మము మండిపోవుచున్నది. 30.న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః|
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ||
నేను ఏమాత్రం నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణా ! కేశిసంహారీ ! అపశకునములను మాత్రమే గాంచుచున్నాను.
31.న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే |
న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ||
ఓ కృష్ణా! యుద్దమందు స్వజనమును చంపుట ద్వారా ఎట్లు మేలు కలుగగలదో నేను గాంచలేకున్నాను. అలాగుననే యుద్దమునందు విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను.
32-35.కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా |
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ||
త ఇమేవస్థితా యుద్ధే ప్రాణం స్త్యక్త్వా ధనాని చ |
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ||
మాతులాః శ్వశురాః పౌత్రా శ్యాలాః సంబంధినస్తథా |
ఏతాన్న హన్తుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన ||
అపి త్రైలోకరాజ్యస్య హేతోః కింను మహీకృతే |
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రితిః స్యాజ్జనార్దన ||
ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, జీవితమును కోరుచున్నామో వారందరును యుద్ధరంగమున నిలచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమిటి? ఒ మధుసూదనా ! ఆచార్యులు, తల్లిదండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, తాతలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందిరును ఆస్తులను, ప్రాణములను విడచి పెట్టుటకు సంసిద్దులై నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలేను ? ఓ జనార్దనా ! భూలోక రాజ్యమునటుంచి ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్దము చేయుటకు సిద్దముగా లేను. దృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము ?
36.పాపయేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః |
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్ స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||
ఇట్టి దుర్మార్గులను చంపుట వలన మాకు పాపమే సంక్రమిస్తుంది. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితముకాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణా ! స్వజనమును చంపుట మాకు కలుగు లాభమేమి? మేమెట్లు సుఖముగా నుండగలము?
37-38.యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన||
ఓ జనార్దనా ! వీరందరును లొభపూర్ణ మనస్సు కారణముగా కులక్షయమందుగాని, మిత్రులతో కలహించుట యందుగాని దోషమును గాంచుటలేదు. కాని వంశనాశనము నందు దోషమును గాంచుచున్న మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నిమగ్నులము కావలెను?
39.కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మేనష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత ||
కులక్షయము వలన శాశ్వతములైన వంశాచారములు నశించిపోవును. తత్కారణముగా వంశమున మిగిలినవారు అధర్మవర్తనులగుదురు.
40.అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః|
స్త్రిషు దుష్టాసు వార్ ష్ణేయ జాయతే వర్ణసంకరః ||
ఓ కృష్ణా! వంశము నందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్టివంశసంజాతుడా ! అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్దినొందును.
41.సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః||
దుష్టసంతానపు వృద్ది వలన కుటుంబమునకు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచిన వారికి నరకము ప్రాప్తించును. పిండోదకక్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు.
42.దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః||
వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాప కర్మల వలన కులధర్మములు, జాతిధర్మములు నాశనమగును.
43.ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతిత్యనుశుశ్రమ||
ఓ జనపోషకుడవైన కృష్ణా ! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని.
44.అహో బత మహత్పాపం కర్తు వ్యవసితా వయం |
యద్ రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||
అహో ! ఎంత విచిత్రము ! రాజ్యసుఖము ననుభవించవలెనను లోభముచే స్వజనమును చంపుట వంటి ఘోరపాపకార్యమును చేయుటకు మేము సిద్దపడియుంటిమి.
45.యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరంక్ భవేత్ ||
నిరాయుధుడను, ప్రతికారము చేయని వాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమున వధించినచో అదినాకు క్షేమకరమేకాగలదు.
46.సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రధోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||
సంజయుడు పలికెను : రణరంగము నందు అర్జనుడిట్లు పలికి ధనుర్బాణములను పడవేసి దుఃఖకల్లోలిత మనస్సుచే రథమునందలి ఆసీనముపై కూర్చుండిపోయెను.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF