గుడ్లు పెట్టాలంటే మగతోడు కావాలా?
ఒరిస్సాలోని భితార్ కనిక వైల్డ్లైఫ్ శాంక్చువరీలో ఇటీవలే ఓ అద్భుతం అనదగ్గ సంఘటన జరిగింది. ఇక్కడ ఉన్న ఓ అరుదైన తెల్లమొసలి ఇటీవల గుడ్లు పెట్టింది. మామూలుగా అయితే ఇది ఓ విశేషం కాకపోవచ్చు. అయితే తోడు లేకుండా గుడ్లు పెట్టడంతో ఇది ఓ సంచలన వార్తగా మారింది.
ఒరిస్సాలోని భితార్కనిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీలోని మొసలి పరిశోధన కేంద్రంలో ఈ వింత చోటు చేసుకుంది. మగ మొసలి తోడు లేకుండానే.. ఎలాంటి కలయిక జరగకుండానే గుడ్లు పెట్టిందీ మొసలి. ఈ తెల్లమొసలి పేరు గోరి వయస్సు 33 సంవత్సరాలు. చాలాకాలంగా ఈ మొసలిని మిగతా మొసళ్లు, ముఖ్యంగా మగ మొసళ్లకు దూరంగా ఉంచుతున్నారు.
ఇటీవల ఈ మొసలి దాదాపు 30 గుడ్లు పెట్టింది. అయితే.. ఈ గుడ్లు వేటికీ పొదిగిన తరువాత పిల్లలుగా మారే సామర్థ్యం లేదని పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. గోరీ పెట్టిన గుడ్లను పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు భద్రం చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఏకైక తెల్లమొసలి ఇదే.
దాదాపుగా అంతరించిపోయే దశలో ఉన్న ఈ జాతి సంతతిని క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా పెంచేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇది పుట్టినప్పటి నుంచి అంటే 1975 నుంచి పాపం బ్రహ్మచారిణిగానే కాలం గడుపుతోంది. ఒకటి రెండుసార్లు జూ అధికారులు ధైర్యం చేసి, మగ మొసలిని దాని దగ్గరికి పంపితే.. గోరి దానిపై దాడి చేసి దాదాపు చంపినంత పనిచేసింది.
అప్పటి నుంచి అధికారులు దానిని ఒంటరిగానే వదిలేశారు. గత కొంతకాలం గోరి అనారోగ్యంతో బాధపడుతోందని అధికారులు వివరించారు. గుడ్లు పెట్టాలంటే మగతోడు కావాలా అని తన పాటికి తాను సవాలు విసురుతోందా ముసలి.
No comments:
Post a Comment