Total Pageviews

Monday, September 5, 2011

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది


ప్లాస్టిక్ వస్తువులు లేని ఇల్లు ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవచ్చు. ఎందుకంటే వంటింటిలో ఎప్పటినుంచో స్త్రీల హృదయాలను గెలుచుకున్న స్టీల్ పాత్రలు ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువుల దెబ్బకు తెల్లబోతున్నాయి మరి. బరువైన స్టీల్ పాత్రను తేలికగా ఉండే ప్లాస్టిక్ వస్తువులు కైవశం చేసుకోవడంతో కాలం వంటిళ్లలో అక్షరాలా ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది.
దానికి తోడు ప్లాస్టిక్ వస్తువులు పలు రకాల వినియోగాలను తీరుస్తూ తమ ఉనికిని ప్రపంచమంతటా చాటుకుంటున్నాయి. కేవలం ఆహార పదార్ధాలను నిల్వ చేసుకోవడం మాత్రమే గాక, ఫ్రిజ్లో మంచి నీటిని తదితర పదార్ధాలను పెట్టుకోవడానికి కూడా అ౦దరు  ప్లాస్టిక్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
పైగా ఫ్రిజ్లో మంచి నీటిని ఉంచుకోవడానికి చాలా మంది  కూల్ డ్రింక్ బాటిళ్లు ఉపయోగిస్తుంటారు. ఇలా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వచేసిన మంచినీటిని, పదార్ధాలను తీసుకోవడం వల్ల మతిమరుపు రావడమే కాక బుద్ధి మందగించడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
ప్లాస్టిక్ పాత్రల తయారీలో వాడే బిస్ఫినాల్ -బీపీఏ- అనే రసాయన పదార్థం వల్ల మెదడు పనితీరులో మార్పులు వస్తాయని  శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో మనుషులలో చదవడం, నేర్చుకోవడం వంటి విషయాల్లో సామర్థ్యం కొరవడుతుంది.
పైగా, ప్లాస్టిక్ బాటిళ్లలో, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేసిన పదార్ధాలు తీసుకుని తినడం వల్ల బీపీఏ మన శరీరంలో ప్రవేశించి మెదడు పనితీరును క్రమక్రమంగా కుంటుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మొత్తం మీద ప్లాస్టిక్ వస్తువు వంటింట్లో మహిళలకు తేలికదనాన్ని ప్రసాదించి ఉండవచ్చు కాని దానిలోని ప్రమాద కారకం మన ఆరోగ్యంపై భారం మోపుతోందని అర్థమవుతోంది కదా. కాబట్టి ప్లాస్టిక్ను పూర్తిగా మానేయడం కాక వీలైనంత వరకు దాని వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది మరి

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF